కుటుంబ సమేతంగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గ అమ్మవారిని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏడో రోజు మూలా నక్షత్ర శుభముహూర్తాన సరస్వతీ దేవి అలంకారంలోని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ప్రత్యేక జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సిరిసంపదలు, సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా మంత్రి కాంక్షించారు.
అంతకుముందు ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు, మంత్రి నారా లోకేష్, సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ లకు ఆలయ అధికారులు, వేద పండితులు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.