

కలియుగ ప్రత్యక్షదైవం, దేవదేవుడు తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల్లో విహరించారు. ఈ సేవలో మూల విరాట్‌ని అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, శ్రీవేంకటేశ్వర సహస్రమాల తదితర వెలకట్టలేని ఆభరణాలతో ఉత్సవమూర్తిని అలంకరించడం విశేషం.
కలియుగ ప్రత్యక్షదైవం, దేవదేవుడు తన ఇష్ట వాహనమైన గరుత్మంతునిపై తిరుమాడవీధుల్లో విహరించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని చూసి ఆధ్యాత్మిక తన్మయత్వం చెందారు.
వేంకటగిరులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. సాక్షాత్తు వేంకటనాథుడే తన అనుంగు వాహనంపై తమను దీవించేందుకు రావడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేవు. ఈ సేవలో మూల విరాట్‌ని అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, శ్రీవేంకటేశ్వర సహస్రమాల… తదితర వెలకట్టలేని ఆభరణాలతో ఉత్సవమూర్తిని అలంకరించడం విశేషం.

గరుడునిపై మలయప్పస్వామిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని విశ్వాసం. సౌపర్ణుడు అంటే విశేషమైన రెక్కలు కలవాడు. తన తల్లి వినత దాస్యాన్ని అంతంచేసేందుకు అమృతభాండం తెచ్చిన కార్యశీలి. పక్షుల్లో రాజు వంటివాడు. అందుకే శ్రీమహావిష్ణువు గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నాడు.
వైకుంఠంలో ఉన్న క్రీడాద్రిని భువిపై తీసుకువచ్చిన మహాబలవంతుడు. వైష్ణవాలయాల్లో మూలవిరాట్‌కు అభిముఖంగా ముకుళిత హస్తాలతో గరుత్మంతుడు ఉంటాడు.వైకుంఠ లోకాత్ గరుడేన విష్ణోఃక్రీడాచలో వేంకటనామధేయఅనీయ చ స్వర్ణముఖి సమీపసంస్థాపితో విష్ణునివాసహేతో!వైకుంఠంలోని క్రీడాద్రిని ఆదివరాహస్వామి ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు సువర్ణముఖి నది సమీపంలోకి తీసుకువచ్చి ప్రతిష్టించాడు. అందుకనే కలియుగంలో సాక్షాత్తు వైకుంఠం నుంచి తీసుకువచ్చిన నివాసం కనుక శ్రీవేంకటేశ్వరస్వామి ఇక్కడే నివాసం ఏర్పరచుకొని తన భక్తులకు నిరంతరం దయామృతం ప్రసాదిస్తున్నాడు.
గరుడవాహన వైభవాన్ని అన్నమయ్య ఇలా కీర్తించాడు. పల్లించిన నీ పసిడి గరుడననికెల్లున నీవెక్కిన యపుడు ఝల్లనె రాక్షస సమితి నీ మహిమవెల్లి మునుగుదురు వేంకటరమణాఓ గోవిందా! జీను వేసి వున్న బంగారు గరుడినిపై నీవు అధిష్ఠించిన సమయంలో రాక్షసుల గుండెలు భయంతో వణికిపోతాయి. అందరూ నీ మహిమలో మునిగిపోతారు స్వామీ!