అహ్మదాబాద్ లోని ఎంట్రెప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఇడిఐఐ) భాగస్వామ్యంతో తెలంగాణాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణ కేంద్రం(Entrepreneurship Development Centre-EDC) ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆసక్తితో ఉందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.

మంగళవారం నాడు ఇడిఐఐ డైరెక్టర్ జనరల్ డా. సునీల్ శుక్లా మంత్రిని కలిసి తమ సంస్థ చేపట్టనున్న కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించారు. ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ, వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక కన్సార్టియం నెలకొల్పుతుందని శ్రీధర్ బాబు తెలిపారు.

దేశంలో ఇడిఐఐ శిక్షణ కేంద్రాలు 17 రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాటయ్యాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణాలో ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల శిక్షణ కేంద్రం ద్వారా వచ్చే నాలుగేళ్లలో 50 వేల మంది యువతకు మధ్య, చిన్న,తరహా, సూక్ష్మ పరిశ్రమలు నెలకొల్పేందుకు అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన వివరించారు. ఏటా కనీసం 5 వేల మంది సొంతంగా ఉపాధి కల్పించుకునేలా, శిక్షణ తర్వాత 6 నెలల వరకు ఇడిసి సహకారం అందిస్తుందని చెప్పారు. కోవిడ్ సమయంలో అమ్మకాలు లేక నష్టపోయిన ఎంఎస్ ఎంఈ లకు ఆర్థిక సహకారం అందించి కోలుకునేలా చేస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థల తరహాలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓఎన్ డీసీ ( open network for digital commerce-ONDC) ప్లాట్ ఫాం ద్వారా ఉచితంగా మార్కెంటింగ్ చేసుకోవచ్చని తెలిపారు. బేటీలో ఇడిఐఐ గోవా ఎంట్రప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ సెంటర్ ఇన్ ఛార్జి డా. అబ్దుల్ రజాక్ కూడా పాల్గొన్నారు.

Spread the love