

అమెరికా ప్రధాన కేంద్రంగా ఉన్న మ్యారియట్ హోటల్స్ హైదరాబాద్ లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్ సామర్థ్య కేంద్రం (GCC) ఏర్పాటు చేస్తుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఆతిథ్య రంగానికి సబంధించిన సామర్థ్య కేంద్రాన్ని దేశంలో మొదటి సారి ఇక్కడ ఏర్పాటు చేయడానికి మ్యారియట్ ముందుకొచ్చిందని ఆయన తెలిపారు.
మ్యారియట్ గ్లోబల్ ప్రతినిధులతో సచివాలయంలో సమావేశం అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు శ్రీధర్ బాబుతో కలిసి మ్యారియట్ ప్రతినిధులు సిఎం రేవంత్ రెడ్డిని కలసి తమ ఆసక్తిని వెల్లడించారు. ఈ సామర్థ్య కేంద్రం వచ్చే ఏడాది మార్చి లోగా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. మొదటి దశలో 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని చెప్పారు. నగరంలో వివిధ టెక్ కంపెనీలకు చెందిన సామర్థ్య కేంద్రాలు 200 వరకు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇవన్నీ సాంకేతిక సంస్థలని వివరించారు.
మ్యారియట్ దేశంలోనే తొలిసారిగా ఆతిథ్య రంగానికి సంబంధించిన జిసిసిని ఏర్పాటు చేస్తోందని శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణాలో 10 లక్షల మంది సాఫ్ట్ వేర్ నిపుణులు ఉండగా ఏటా లక్షన్నర మంది ఇంజనీరింగ్ విద్యార్థులు చదువులు పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారని ఆయన తెలిపారు. వీరందరికి గ్లోబల్ సామర్థ్య కేంద్రాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. ద్వీతీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా టెక్ యాక్సిలరేటరీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తితో ఉందని శ్రీధర్ బాబు వెల్లడించారు.
త్వరలో కార్యరూపం దాల్చనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలో మ్యారియట్ సంస్థ హోటళ్లను నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా హోటల్స్ ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చిందని శ్రీధర్ బాబు వెల్లడించారు. మీడియా సమావేశంలో మ్యారియట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ రెవెన్యూ & టెక్నాలజీ ఆఫీసర్ డ్రూ పింటో, గ్లోబల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నవీన్ మంగ, చీఫ్ సేల్స్ & మార్కెటింగ్ ఆఫీసర్ జాన్ టూమీ (ఆసియా పసిఫిక్, చైనా తప్పించి), గ్రెగ్ మార్టెల్ (విపి – టెక్నాలజీ బిజినెస్ మేనేజ్‌మెంట్), అశిష్ కేలే (వైస్ ప్రెసిడెంట్ – ఐటీ ఆపరేషన్స్, ఆసియా పసిఫిక్, చైనా తప్పించి), అలెగ్జాండర్ ప్యాన్ (చీఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫీసర్), మరియు మంసూర్ బైగ్ (సీనియర్ ఏరియా డైరెక్టర్ – ఐటీ ఆపరేషన్స్, దక్షిణ ఆసియా) లు పాల్గొన్నారు.
గ్రీన్ ఫార్మా సిటీలో కాలుష్యం అనేదే ఉండదు…
తాము ఏర్పాటు చేయబోయే ఫార్మా సిటీ పూర్తిగా పర్యావరణ హితంగా ఉంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. అసలు కాలుష్యమే వెలువడదని (జీరో పొల్యూషన్) పరిశ్రమలు ఉంటాయని చెప్పారు. కొద్ది పాటు రసాయన కాలుష్య వ్యర్థాలు ఉత్పత్తి అయినా ఆయా కంపెనీలే సొంత ట్రీట్ మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేసుకుంటాయని వెల్లడించారు. మరో పది రోజుల్లో ఎన్ని ఫార్మా కంపెనీలు వచ్చేది తెలుస్తుందని ఆయన వివరించారు. ఫార్మా సిటీ అంటే కేవలం ఔషధ పరిశ్రమలే కాకుండా, గృహవసతి కల్పించే సంస్థలు, హోటల్స్, వినోద రంగం, విద్యాసంస్థలు అన్ని ఉంటాయని శ్రీధర్ బాబు తెలిపారు.