

ఉద్యోగులకు దసరా కానుకగా డీఏలను ఇవ్వాలని కోరిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ.
వేం నరేందర్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు.
రాష్ట్రంలోని ఉద్యోగులకు డీఏలను దసరా కానుకగా చెల్లించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కోరారు.
డీఏ కోసం రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పెండ్డింగ్‌లో ఉన్న డీఏలను ప్రజాప్రభుత్వంలో దసరా కానుకగా చెల్లిస్తారని నమ్మకంతో ఉద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా లచ్చిరెడ్డి రాష్ట్రంలో ఉద్యోగులకు రావాల్సిన డీఏలను గురించి నరేందర్‌రెడ్డికి వివరించారు.గత ప్రభుత్వంలోనే చెల్లించాల్సిన రెండు డీఏలను ఇవ్వలేదన్నారు.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీఏలను చెల్లిస్తుందనే ఆశతో ఉద్యోగులు ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లోనూ, అమలు చేసే సంక్షేమ పథకాలలోనూ ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉందన్నారు.
ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి డీఏలను ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించేలా చూడాలని కోరారు.
కార్యక్రమంలో టీజీ ఉద్యోగుల జేఏసీ నేతలు కె. రామకృష్ణ, డా. జి.నిర్మల, రమేష్ పాక, తదితరులు పాల్గొన్నారు.