
ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ముందడుగు.
ఉత్పత్తి , రక్షణతో పాటు సింగరేణి విస్తరణకు కార్మిక సంఘాల సహకారం అవసరం.
గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక నాయకుల శిక్షణ ముగింపు సమావేశంలో సీఎండీ ఎన్.బలరామ్.
సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలతో పాటు కంపెనీ చేపడుతున్న వ్యాపార విస్తరణ చర్యలకు కార్మిక సంఘాల సహకారం ఎంతో అవసరమని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో శుక్రవారం సాయంత్రం జరిగిన గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక నాయకుల 4 రోజుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగులు పూర్తి పనిగంటలు సద్వినియోగం చేస్తూ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడడంలో కార్మిక సంఘాలు కూడా తోడ్పాటు అందించాలన్నారు.
ఈ ఏడాదికి నిర్దేశిత 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి కార్మికులను మరింత చైతన్య పరచాలని సూచించారు. ఉత్పాదకత పెరిగితేనే సింగరేణికి భవిష్యత్తు ఉంటుందన్నారు. రానున్న ఐదేళ్ల కాలంలో సింగరేణి సంస్థ 100 మిలియన్ టన్నుల లక్ష్యంగా ముందుకు పోతోందని, అలాగే వ్యాపార విస్తరణలో భాగంగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సంసిద్ధమవుతుందన్నారు.
సింగరేణి వ్యాపార విస్తరణ చర్యలకు కార్మిక సంఘాలు సంపూర్ణ సహకారం అందించాల్సి ఉంటుందన్నారు. సింగరేణికి ఆర్థిక పరిపుష్టి కలిగించడం కోసమే వ్యాపార విస్తరణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ ఉత్పత్తి ఉత్పాదకతను గణనీయంగా పెంచిన పక్షంలో కోల్ ఇండియా తరహాలో ఆధునిక టెక్నాలజీ, ఉత్పాదకత పెంపుదల వంటి అంశాలపై పరిశీలన జరపడానికి కార్మిక సంఘాల నాయకులను విదేశీ పర్యటనకు పంపించే విషయమై ఆలోచన చేస్తామని చెప్పారు.
మూడు రోజులపాటు నిర్వహించిన శిక్షణ శిబిరం కార్మిక నాయకుల నాయకత్వ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ మరియు పర్సనల్ శ్రీ జి.వెంకటేశ్వర్ రెడ్డి, గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రెటరీ శ్రీ రాజకుమార్, ప్రాతినిథ్య కార్మిక సంఘం ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్, కనీస వేతనాల సలహా సంఘం ఛైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్, జనరల్ సెక్రెటరీ శ్రీ త్యాగరాజన్ ప్రసాద్ ప్రసంగించారు.
- -ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ శ్రీ రామేశ్వరరావు స్వాగతం పలకగా కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ శ్రీ ఎస్.డి.ఎం. సుభాని, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ శ్రీ రవి ప్రసాద్, జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీమతి కవితా నాయుడు ఏజీఎం శ్రీ లక్ష్మీనారాయణ డీజీఎంలు శ్రీ అజయ్ కుమార్, రాజగోపాల్ పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని సింగరేణి మానవ వనరుల అభివృద్ది విభాగం, పారిశ్రామిక సంబంధాల విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సీఎండీ ఎన్. బలరామ్ సర్టిఫికెట్ లను అందజేశారు.