

అమెరికాలో మంత్రి జూపల్లికి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ పర్యాటక ప్రమోషన్, అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో అడుగుపెట్టిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు అక్కడ ఘన స్వాగతం లభించింది. దుబాయ్ నుంచి అమెరికాలోని వాషింగ్టన్ డిసీ నగరానికి చేరుకున్న మంత్రికి పలువురు ఎన్నారైలుపుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
లాస్ వేగాస్ లో జరగనున్న IMEX (Worldwide Exhibition for Incentive Travel, Meetings, and Events.)

వాణిజ్య ప్రదర్శనలో పాల్గొననున్న మంత్రి. అక్టోబర్ 8 – 10 వరకు జరగనున్న గ్లోబల్ సమావేశాలు. గ్లోబల్ మీటింగ్‌లు, ఈవెంట్స్ ఇండస్ట్రీ లీడర్‌లను ఏకం చేసే వేదికగా IMEX.
IMEX అమెరికా 2024 పేరిట లాస్ వేగాస్ లో నిర్వహించనున్న అతి పెద్ద వాణిజ్య ప్రదర్శనలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొంటారు. ఆదివారం దుబాయ్ నుంచి అమెరికా వెళ్లారు. సోమవారం అక్టోబర్ 7న వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు.
అక్టోబర్ 8న లాస్ ఎంజెల్స్, అక్టోబర్ 9,10న లాస్ వెగాస్, అక్టోబర్ 11న అట్లాంటాలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అమెరికా పర్యటన ముగించుకుని అక్టోబర్ 12న భారత్ చేరుకొంటారు.
తెలంగాణ పర్యాటక రంగానికి కలిసి వచ్చే అంశాలను సద్వినియోగం చేసుకుంటూ పర్యాటక రంగాన్ని కొత్తపుంతలు తొక్కించడం, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా పర్యటన కొనసాగనుంది.
ప్రపంచ సమావేశాలు, ఈవెంట్‌లు, ప్రోత్సాహక ప్రయాణాల కోసం నిర్వహించే ఈ అతిపెద్ద వాణిజ్య ప్రదర్శనలో అమెరికా, ఇండియా, కెనడా, మెక్సికో, బ్రెజిల్, దుబాయ్ సహా పలు దేశాలు పాల్గొననున్నాయి. ప్రపంచ నలుమూలల నుండి వచ్చే సరఫరాదారులు, కొనుగోలుదారులను ఒకచోట చేర్చే అంతర్జాతీయ గమ్యస్థానంగా IMEX నిలవనుంది. ఆయా దేశాలు తమ సామర్థ్యాలను ప్రదర్శించడానికి, కీలకమైన కొనుగోలుదారులతో సన్నిహిత సంబంధాలను మరింత మెరుగుపరచడానికి, వ్యాపార పర్యాటక భవిష్యత్తును నడపడానికి IMEX ఒక వేదిక కానుంది.