
వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన ఈ నెల 15న జరగనుంది.
అడవిలో రాడార్ స్టేషన్ ఏర్పాటు పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురవుతున్న ప్రభుత్వం ముందుకే పోవాలని నిర్ణయం తీసుకుంది.
ఈనెల 15న వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని దామగుండంలో ఏర్పాటుకానున్న నేవీ రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మంత్రి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రికను అందించారు.
ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుతో భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని అన్నారు. పరిగి నియోజకవర్గ ప్రజలకు ఈ స్టేషన్ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు, దేశంలోనే రెండో రాడార్ స్టేషన్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు లభించనుందని మంత్రి తెలిపారు.
రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్,పలువురు నేవీ అధికారులు ఈ సందర్భంగా మంత్రిగారిని కలిసారు.