

— సింగరేణిని అగ్రగామిగా నిలపడమే మా లక్ష్యం. విదేశీ కంపెనీలతో సింగరేణి ఉమ్మడి భాగస్వామ్యం. నూతన రంగాల్లోకి ప్రవేశం. సింగరేణి ఖాళీ ప్రదేశాల్లో ఇకపై గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు.
— సింగరేణి ప్రాంతాల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు. అత్యాధునిక వైద్య సేవల కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. దసరా సందర్భంగా అన్ని గనుల్లో విందు, ఉత్పాదకత పెంపుదలపై అవగాహన.
— సింగరేణి ఉద్యోగులకు రూ. 796 కోట్ల లాభాల వాటా పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు.
ఈ నెలలో లాభాల వాటా, దీపావళి బోనస్ లు, పండుగ అడ్వాన్స్ లు కలిపి రూ. 1261 కోట్ల చెల్లింపు సింగరేణి చరిత్రలోనే అత్యధికం.
సాధిస్తున్న లాభాల్లో కొంత శాతం పక్కన పెట్టి కంపెనీ భవిష్యత్తు కోసం, బహుముఖ వ్యాపార విస్తరణ కోసం ఖర్చు చేయనున్నామని, కేవలం బొగ్గు మాత్రమే కాకుండా ఇతర ఖనిజ పరిశ్రమల్లోకి కూడా సింగరేణి సంస్థ విస్తరించడానికి కృషి చేస్తున్నామని, సింగరేణిని అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక మరియు ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిభాపూలే ప్రజా భవన్ లో ఆయన సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెక్కుల్ని పంపిణీ చేసిన అనంతరం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు, గుర్తింపు, ప్రాతినిథ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలను కాపాడటం తమ ధ్యేయం అని, తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ప్రణాళికలు రూపందిస్తున్నామని శ్రీ భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. లాభాల విషయంలో గత ప్రభుత్వం మాదిరిగా తాము దాపరికాలు చేయడంలేదని, వచ్చిన లాభాల్లో కొంత శాతం సంస్థ కొత్త గనులు ప్రారంభించడానికి, కొత్త వ్యాపారాలు చేపట్టడానికి వినియోగిస్తున్నామన్నారు.
సింగరేణి సంస్థ అభివృద్ధిలో తమ వంతుగా విశేషమైన సేవ చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సేవలను గుర్తిస్తూ తొలిసారిగా లాభాల నుండి ఒక్కొకరికి రూ.5 వేల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. లాభాల వాటా, దీపావళి బోనస్ లు, పండుగ అడ్వాన్స్ లు కలిపి రూ. 1261 కోట్ల రూపాయల చెల్లింపు :సింగరేణి కార్మికులకు లాభాల వాటా కింద సగటున ఒక్కో కార్మికుడికి 1.90 లక్షల చొప్పున 796 కోట్ల రూపాయలను, దీపావళి బోనస్ కింద ఒక్కో కార్మికుడికి రూ.93,750 చొప్పున రూ.375కోట్లను, దసరా పండుగ అడ్వాన్స్ కింద ఒక్కో కార్మికుడికి రూ.25 వేల చొప్పున 90 కోట్ల రూపాయలను కలిపి కంపెనీ ఈ నెలలో రూ.1261 కోట్ల ను చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే ఈ నెల 3 వ తేదీన పండుగ అడ్వాన్స్ ను ఈ రోజున ప్రజా భవన్ వేదికగా లాభాల వాటా కింద రూ. 796 కోట్లను చెల్లించినట్లు పేర్కొన్నారు. దీపావళి బోనస్ ను పండుగకు ముందు సింగరేణి చెల్లిస్తుందని తెలిపారు. రానున్న కాలంలో బొగ్గు నిల్వలు తగ్గిపోవడంతో పాటు బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాలపై పర్యావరణహిత ఆంక్షలు కూడా ఉంటాయి గనుక సింగరేణి సంస్థ తన మనుగడ కొనసాగించడం కోసం లిథియం వంటి ఇతర పరిశ్రమలలోకి అడుగు పెట్టబోతోందని, థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ఇంకా ఇతర గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులను చేపట్టనున్నదని పేర్కొన్నారు. కొన్ని విదేశీ కంపెనీలతో కలిసి ఉమ్మడి భాగస్వామ్యంతో అధునాతన ఉత్పత్తుల పరిశ్రమలు కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
సింగరేణి ప్రాంతంలో ఉన్నవి ఖాళీ ప్రదేశాలు కావని అవి భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లకు ఆవాసాలు కానున్నాయని ఇవే ఇకపై సింగరేణికి నిధులు సమకూర్చే ఆస్తులని తెలిపారు.
దసరా సందర్భంగా ప్రతి గనిలో విందు-ఉత్పాదకతపై అవగాహన:
సింగరేణి బాగా పనిచేస్తున్నప్పటికి బొగ్గు ఉత్పత్తి వ్యయం చాలా వరకు తగ్గించుకోవాలని అప్పుడే కంపెనీ కి భవిష్యత్తు ఉటుందన్నారు. బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి కార్మికుల ఉత్పత్తి వ్యయం కన్నా కాంట్రాక్టు కార్మికుల ఉత్పత్తి వ్యయం చాలా తక్కువగా ఉందని, ఈ వ్యత్యాసాలను సవరించుకుంటే సింగరేణి సంస్థ మరింత ఎక్కువ లాభాలను, అభివృద్ధిని సాధించగలదన్నారు.
కార్మికులకు ఈ వాస్తవాలు వివరించడం కోసం దసరాకు ముందు 11వ తేదీన అన్ని గనుల్లో కంపెనీ ఖర్చుతో పెద్ద ఎత్తున విందు ఏర్పాటు చేయాలని అదే కార్యక్రమంలో కార్మికులకు సంస్థ వాస్తవ పరిస్థితుల్ని ఉత్పత్తి వ్యయం తగ్గింపు, భవిష్యత్తు వ్యాపార విస్తరణ చర్యల గురుంచి దృశ్య రూపంలో వివరించాలని తెలిపారు.సింగరేణి అభివృద్దికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. సింగరేణి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తాను కూడా స్వయంగా కొత్త గనుల కోసం కేంద్రబొగ్గు శాఖ వారితో మాట్లాడానని, ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించానని, సింగరేణి ప్రాంతం నుంచి ఒక్క గని కూడా ఇతరులకు పోకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని ఆయన హర్షధ్వనుల మధ్య ప్రకటించారు. సంక్షేమం విషయంలో ఆకాశమే హద్దుగా పనిచేస్తామని ఖర్చు విషయంలో ఎటువంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారని తెలిపారు. త్వరలోనే సింగరేణి వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పబోతున్నామని, అలాగే సింగరేణి ప్రాంతంలో అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రిటైర్డ్ కార్మికుల వైద్య సేవల పరిమితి రూ. 8 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంపు : రిటైర్డ్ కార్మికులకు ప్రస్తుతం అమలు జరుపుతున్న సీ.పీఆర్ఎంఎస్ వైద్య సేవల పరిమితిని 8 లక్షల రూపాయలను 10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. వారి సొంత గృహాలకు స్థలాలు కేటాయింపుపై త్వరలో వివరాలు సేకరించి చర్చిస్తామన్నారు. రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంపుదలపై కూడా ఆలోచిస్తామని, తగు నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నప్పటికీ తమ ప్రాంతంలో హైదరాబాద్ తరహా అత్యుత్తమ స్థాయి విద్యను అందించే పాఠశాలలు ఏర్పాటు చేయాలని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసి కార్మికులకే కాక ఇతరులకు కూడా విద్య, వైద్య సేవలు అందించాలన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని తమ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేశామని, ఇక ముందు కూడా కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. తొలిసారిగా కాంట్రాక్టు కార్మికులను గుర్తించి వారికి బోనస్ ను అందిస్తున్నామని ఇది ఇకపై కొనసాగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సింగరేణి సంస్థ సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ స్వాగతోపాన్యాసం చేశారు. కార్యక్రమంలో ఇంకా సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు శ్రీ కూనమనేని సాంబశివరావు, శ్రీ గడ్డం వినోద్, శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి, శ్రీ ప్రేమ్ సాగర్ రావు, శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, శ్రీ కోరం కనకయ్య, డాక్టర్ మట్టా రాగమయి, శ్రీ గండ్ర సత్యనారాయణ రావు, గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సీతారామయ్య, ప్రాతినిధ్య కార్మిక సంఘం (ఐఎన్ టి యు సి) సెక్రెటరీ జనరల్, కనీస వేతనాల అమలు కమిటీ ఛైర్మన్ శ్రీ బి.జనక్ ప్రసాద్, తదితరులు ప్రసంగిస్తూ సింగరేణి కార్మిక సంక్షేమానికి, సమీప గ్రామాల అభివృద్దికి రిటైర్డ్ కార్మికుల సమస్యలపై పలు సూచనలు చేశారు.
లాభాల వాటా టాపర్ శ్రీనివాస్ కు రూ. 3.24 లక్షల బోనస్ :సింగరేణి వ్యాప్తంగా అత్యధిక లాభాల వాటా పొందిన కార్మికులు అధికారులకు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, చెక్కుల్ని ప్రదానం చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఎస్.డి.ఎల్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఆసం శ్రీనివాస్ 304 రోజులు పని చేసి రూ. 3 లక్షల 24 వేల 150 రూపాయల లాభాల వాటాను పొంది సింగరేణి టాపర్ గా నిలిచాడు. ఆ తర్వాత కార్మికులు జెస్సి రాజ్ రూ. 3 లక్షల పదివేలు, ఎ.శ్రీనివాస్ రూ. 3 లక్షలు, ఎం.తిరుపతి రూ. 3 లక్షల రూపాయల లాభాల వాటా పొందారు. అలాగే కొందరు కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ సందర్భంగా 5000 రూపాయలు బోనస్ చెక్కులను పంపిణీ చేశారు.