మూసీ రివర్ ఫ్రంట్ సుందరీకరణ పథకం వల్ల పేదలు ఎవరూ నష్టపోకుండా చూస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు.

గురువారం నాడు తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు తనను, పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసిన 20 కి పైగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు ప్రసంగిస్తూ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో అందరి సలహాలు, సూచనలను గౌరవిస్తామని తెలిపారు.

ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించవద్దని అధికార యంత్రాంగాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారని శ్రీధర్ బాబు గుర్తు చేసారు. మూసీ నదీ గర్భంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి పునరావాసం కల్పిస్తామని, ఎవరినీ రోడ్ల పైకి పంపించే ప్రసక్తే లేదని అన్నారు. తెలిసో తెలియకో కొంత కాలంగా వారంతా మురుగునీటి ప్రవాహం పక్కన నివాసాలు నిర్మించుకున్నారని తెలిపారు.

మూసీకి లక్ష క్యూసెక్కులకు పైగా భారీ వరద వచ్చినప్పుడు రివర్ బెడ్ లో ఉన్న ప్రజానీకానికి ప్రాణాపాయం, ఆస్తి నష్టం జరుగుతుందనేదే తమ ఆందోళన అని వివరించారు. బఫర్ జోన్ లో ఆక్రమణల తొలగింపు విషయంలో కూడా అందరి అభిప్రాయాలను సానుకూలంగా వింటామని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రెండు వైపులా ఉన్న పురాతన ఆలయాలు, సంస్కృతి చిహ్నాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శ్రీధర్ బాబు అన్నారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వల్ల నదీ పరివాహక ప్రాంతమంతా పర్యాటక కేంద్రంగా మారుతుందని తెలిపారు. వేల మంది స్థానికులకు ఉపాధి దొరుకుతుందని వివరించారు. ఎవరు రెచ్చగొట్టినా, ప్రలోభ పెట్టాలని చూసినా అనవసర ఆవేశాలకు పోవద్దని మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు హితవు చెప్పారు. వారికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవాల్సింది ప్రభుత్వమేనని, రాజకీయంగా వాడుకోవాలని చూసేవారి వల్ల నష్టపోవడం తప్ప ఎటువంటి ఒరిగేది ఏమీ ఉండదని తెలిపారు.

సమావేశంలో తెలంగాణా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ ఎం. కోదండరెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొ. హరగోపాల్, ప్రొ. శాంతాసిన్హా, సజయ, సంధ్య, బ్రదర్ వర్ఘీస్, మీరా సంఘమిత్ర, బిలాల్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love